Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Wednesday, July 24, 2013

2వతిమోతికి3వఅధ్యాయము

1  అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. 
2  ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు. 
3  అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు, 
4  ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, 
5  పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. 
6-7. పాపభరితులై నానావిధములైన దురాశలవలన నడిపింపబడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలయొక్క యిండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. 
8  యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సుకలిగి విశ్వాసవిషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. 
9  అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో ఆలాగే వీరిదికూడ అందరికి తేటపడును గనుక వీరు ఇకను ముందుకు సాగరు. 
10  అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును, 
11  అంతియొకైయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను. 
12  క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింస పొందుదురు. 
13  అయితే దుర్జనులును వంచకులును (ఇతరులను) మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు. 
14-15. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములు బాల్యమునుండి నీవెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని వాటియందు నిలుకడగా ఉండుము. 
  16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది. 

No comments:

Post a Comment